- అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ దివాకర తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలలో జరగనున్నట్లు వివరించారు.
ఎన్నికల షెడ్యూల్..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్–Iలో ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్లు, ఈ నెల 23న పోలింగ్ ఉంటుందన్నారు. ఫేజ్–IIలో ఈ నెల 13 నుంచి 15వరకు నామినేషన్లు, 27న పోలింగ్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 11 నిర్వహించనున్నామని, గ్రామ పంచాయతీ ఫేజ్–II: ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు, వచ్చేనెల 4న పోలింగ్. ఫేజ్–IIIలో ఈ నెల 25 నుంచి 27 వరకు నామినేషన్లు, వచ్చేనెల 8న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్ వివరించారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
జిల్లాలో 9 మండలాల్లో 146 గ్రామ పంచాయతీలు, 1290 వార్డులు, మొత్తం 1306 పోలింగ్ స్టేషన్లు, 217 పోలింగ్ లోకేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. 11 ఎఫ్‌ఎస్‌టీ, 6 ఎస్‌ఎస్‌టీ జట్లను మానిటరింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాల్లో 3 ఎస్టీ, 4 ఎస్సీ, 1 బీసీ, 2 అన్ రిజర్వ్డ్ కేటాయించగా, 69 ఎంపీటీసీ స్థానాల్లో 22 ఎస్టీ, 6 ఎస్సీ, 22 బీసీ, 19 అన్ రిజర్వ్డ్ కేటాయించారని వివరించారు. 229159 మంది ఓటర్లలో పురుషులు 1,10,838; మహిళలు 1,18,299; ఇతరులు 22 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వెల్లడించారు. పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ విధానం ద్వారా ఎంపిక చేసి విధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అప్పీల్‌కు ఒక రోజు గడువు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్..
ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుల కోసం ఓటర్లు టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు సంప్రదించవచ్చని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు షెడ్యూల్ ప్రకారం వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులను నిర్ణీత గడువులో తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లను బెదిరించడం, ప్రభావితం చేయడం, డబ్బు లేదా మద్యం పంచడం వంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు. మంగపేట మండలంలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవ్ రాజ్, పీఆర్‌ఓ ఎం.డి. రఫిక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


