రజబ్ అలీ ఆశయాలను కొనసాగిద్దాం
నిరాడంబరత, నిజాయితీకి నిలువుటద్దం
భూపోరాటాల ద్వారా పేదలకు న్యాయం చేసిన నేత
అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకగా గర్జన
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం : ప్రజాపక్షపాతి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మహమ్మద్ రజబ్ అలీ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌లో రజబ్ అలీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రజబ్ అలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలను స్మరించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాధారణ జీవితం గడిపిన నాయకుడిగా రజబ్ అలీ నిలిచారని తెలిపారు. భూపోరాటాల ద్వారా వేలాది ఎకరాల భూమిని పేదలకు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
భూపోరాటాల స్పూర్తి కొనసాగాలి
సాయుధ పోరాట కాలంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పేదలపాలిట పెన్నిధిగా నిలిచారని వివరించారు. అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. నేటి రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్న తరుణంలో రజబ్ అలీ చూపిన నిజాయితీ, నిరాడంబరత నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కె రత్నకుమారి, నాయకులు షాహీన్, అఫ్సర్, వినయ్, మోహన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


