న్యాయ అవగాహనే రక్షణ కవచం
కాకతీయ కరీంనగర్ : నేటి బాలలే రేపటి దేశ భవితవ్యమని, చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగినప్పుడే వారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ధైర్యంగా ప్రతిస్పందించగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బాల వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ చట్టాల అవగాహన సదస్సు విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా న్యాయవాదులు బాల్య వివాహాల వల్ల కలిగే తీవ్ర అనర్థాలను వివరించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం చిన్నారుల వివాహాలు చట్ట విరుద్ధమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. చిన్న వయసులో వివాహం చేయడం బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్ర ప్రకాశ్ రెడ్డి, కిరణ్ కుమార్, మాన్వాడ రామాంజనేయులు, బలాసుల శాంతి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీమేష్, విద్యార్థులు పాల్గొన్నారు


