- అభిప్రాయాల ఆధారంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
- ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ పథకం కింద, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకత్వాన్ని పారదర్శకంగా ఎంపిక చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నదే అధిష్ఠానం ఉద్దేశమని అన్నారు.
గ్రామస్థాయిలో పార్టీ పటిష్ఠత కోసం జిల్లా అధ్యక్షుడి పాత్ర కీలకమైనదని, అందువల్ల కార్యకర్తల అభిప్రాయమే నిర్ణయాత్మకంగా మారుతుందన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నిబద్ధతతో పని చేసినవారిని ఎప్పటికీ గుర్తించి గౌరవిస్తుందని తెలిపారు. నాయకుల విజయాల వెనుక కార్యకర్తల కృషి ఉంటుందనీ, పార్టీ పట్ల అవిశ్రాంతంగా పని చేసే కార్యకర్తలే నిజమైన బలమన్నారు. వ్యక్తిగత విభేదాల కన్నా పార్టీ పటిష్ఠతకు ముందడుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని, పార్టీ చరిత్రను పరిరక్షించడం మనందరిపై బాధ్యతగా ఉందని అన్నారు. నాయకత్వ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
గంగాధర మండలంలో.
గంగాధర మండలంలోని మధురానగర్‌లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మరో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుని నియామకం పై కార్యకర్తల అభిప్రాయాలను మానే శ్రీనివాస్ సేకరించారు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు నివేదిక రూపంలో పంపనున్నట్లు తెలిపారు. ఈ రెండు సమావేశాల్లో టీపీసీసీ ప్రతినిధులు చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్, మండల అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, నందగిరి రవీంద్రచారి, గోపగోని బస్వయ్యగౌడ్, బండారి రమేశ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా నాయకులు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.


