- నేటితరం నేతల్లో కూడబెట్టేటోళ్లే అధికం
- వేలాది ఎకరాల వారసత్వ భూములను త్యాగం చేశారు
- నల్గొండకు గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత దామోదర్‌రెడ్డిదే
- ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ గా నామకరణం చేస్తాం
- 24గంటల్లో జీవో జారీ చేస్తాం : సంతా పసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ, తుంగతుర్తి : నల్గొండ జిల్లాలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దాని క్రెడిట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ (మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి) ఎస్సారెస్పీ 2గా నామకరణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో జారీ చేస్తామన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదు. వారు చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన మరణం చాలా బాధాకరం, కానీ ఆయన జీవితం త్యాగానికి, నిబద్ధతకు, ప్రజాప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరినా.. ఆస్తుల కోసం కాదు, కార్యకర్తలు, పార్టీ కోసం పని చేశారు.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భూములు త్యాగం చేశారు
నేటి కాలంలో ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయినా కోట్లు కూడబెడతారు. కానీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములనూ త్యాగం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను అగ్రస్థానంలో ఉంచారు. గోదావరి జలాలను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన పోరాటం మరువలేనిదని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా గోదావరి నీళ్లను నల్గొండ జిల్లాకు తెచ్చే ప్రయత్నంలో దామన్న వహించిన పాత్ర కీలకం. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 2 ప్రారంభానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. సూర్యాపేట కేంద్రంగా పనిచేసినా, తుంగతుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలకు దామన్న పెద్ద అండగా నిలిచారు. ఆయన సేవల ఫలితంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ 50 వేల మెజారిటీతో గెలిచారు. ఆయనను “టైగర్ దామన్న”గా సంబోధించడం ఆయన త్యాగానికి, ధైర్యానికి ఇచ్చిన గుర్తింపు అని అన్నారు.
కాంగ్రెస్‌తోనే చివరివరకూ జీవితం
రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అమితమైన ప్రేమతో జీవించారు. చివరి శ్వాస కూడా కాంగ్రెస్ జెండాతోనే విడిచారు. జోడెద్దుల్లా రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని నల్గొండలో నిలబెట్టారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలియజేశారు. రాహుల్ గాంధీ స్వయంగా రాంరెడ్డి కుమారుడు సర్వోత్తంకు సంతాప లేఖ రాసి, భవిష్యత్తులో రాజకీయంగా కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.


