మేడారం పనుల్లో అలసత్వం
క్యూలైన్లు పూర్తి కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన
కొనసాగుతునే ఉన్న విద్యుత్ పనులు
మంత్రుల డెడ్‌లైన్‌కు విలువ లేదా?
జాతరకు ఇంకా రెండు రోజులే సమయం
భక్తుల్లో పెరుగుతున్న అసంతృప్తి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనుల్లో తీవ్ర అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న మహాజాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లకు పైగా నిధులు వెచ్చించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కీలక పనులు ఇంకా పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాల్సిన సమయంలో, పనులు ఇంకా కొనసాగుతుండటం భక్తుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ముఖ్యంగా క్యూలైన్లు, విద్యుత్ పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తికాని క్యూలైన్ నిర్మాణం
మహాజాతర సమయంలో భక్తులను క్రమబద్ధంగా దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేస్తున్న క్యూలైన్ల నిర్మాణం ఇంకా కొనసాగుతుండటం ప్రధాన సమస్యగా మారింది. మేడారం ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసి కేవలం మూడు నెలల్లో ఆలయ ప్రాంగణాలను నిర్మించిన అధికారులు, అత్యంత కీలకమైన క్యూలైన్ పనులను మాత్రం నత్తనడకన కొనసాగించడం విడ్డూరంగా ఉందని భక్తులు విమర్శిస్తున్నారు. ఒకవైపు అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా, మరోవైపు భారీ యంత్రాలతో క్యూలైన్ పనులు కొనసాగడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో పనుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న విద్యుత్ పునరుద్ధరణ
మేడారం పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌కు సంబంధించిన పనులు కూడా ఇంకా పూర్తికాకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. అక్కడక్కడ విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు చుట్టే పనులు కొనసాగుతుండటంతో భక్తులు అడ్డంకులకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పనులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పనులు పూర్తి కాకపోతే జాతర సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడమే కాకుండా, ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జాతరకు కనీసం పది రోజుల ముందుగానే అన్ని అభివృద్ధి పనులు పూర్తిచేయాలని మంత్రులు స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు, భక్తులు పదేపదే సమస్యలు ప్రస్తావిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది.
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
మేడారం మహాజాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇప్పటికైనా పనులను వేగవంతం చేసి పూర్తిచేయకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. జాతరకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భక్తులు స్పష్టం చేస్తున్నారు.


