మహిళల భద్రతకు చట్టమే కవచం
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
పోష్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలి
ప్రతి కార్యాలయంలో అంతర్గత కమిటీ తప్పనిసరి
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు పోష్ యాక్ట్–రెండు వేల పదమూడు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోష్ యాక్ట్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోష్ యాక్ట్‌కు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యస్థలాల్లో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ప్రతి శాఖాధిపతి, కార్యాలయ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రతి కార్యాలయంలో కమిటీ ఏర్పాటు
పోష్ యాక్ట్ ప్రకారం పది మందికి మించిన సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ కమిటీలో యాభై శాతం మహిళలు ఉండాలని, మహిళా అధ్యక్షురాలు ఉండటంతో పాటు బయటి నిపుణుడిని సభ్యుడిగా నియమించాల్సిందేనని తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు గోప్యత పాటిస్తూ, నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బాధిత మహిళలకు భరోసా కలిగించే వాతావరణం ఉండాలని స్పష్టం చేశారు.
అవగాహనతోనే రక్షణ
పోష్ యాక్ట్‌పై ఉద్యోగులకు తరచూ శిక్షణలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అన్ని కార్యాలయాల్లో గోడపత్రాలు, కరపత్రాలు ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు భయపడకుండా, ధైర్యంగా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి రాంరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ఆర్డీఓలు సుమారు, ఉమారాణి, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


