ఏకశిలా నగర్‌లో భూదందా
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కయ్యారు
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదు.
మిస్టర్ వెంకటేశ్వర్‌ను వదిలిపెట్టను
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వార్నింగ్
24 గంటల్లో ఆయన్ను అరెస్టు చేయకపోతే ఉద్యమం ఉధృతం
గుండాలు, అధికారుల భరతం పడతామంటూ హెచ్చరిక
ఏకశిలా నగర్‌లో బాధితుల పక్షాన నిలిచిన ఎంపీ ఈటల
కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో చోటుచేసుకుంటున్న భూదందాపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధిత ప్లాట్ ఓనర్లను పరామర్శించిన ఆయన, ల్యాండ్ మాఫియా, రెవెన్యూ అధికారులు, పోలీసులు కుమ్మక్కై సామాన్యుల ఆస్తులను దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏకశిలా నగర్‌లో స్థానికులను పరామర్శించిన ఈటల రాజేందర్ ఈసందర్భంగా మాట్లాడుతూ 1985లో అప్పటి కొర్రేముల గ్రామ పరిధిలో 146 ఎకరాల్లో 2,086 ప్లాట్లు వేసి విక్రయించారని తెలిపారు. సింగరేణి, విద్యుత్ శాఖ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కూరగాయలు, పాలు అమ్ముకునే సామాన్య ప్రజలు అప్పట్లో ఈ స్థలాలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అయితే రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ల్యాండ్ మాఫియా గ్యాంగ్‌తో కలిసి 47 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచే ఏకశిలా నగర్ వాసుల కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
అధికారుల అండతోనే గుండాల ఆగడాలు..!
డబ్బులకు ఆశపడి ఆనాటి రెవెన్యూ అధికారులు, పోలీసులు ల్యాండ్ మాఫియాకు మద్దతు ఇచ్చారని ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐక్యత లేక, శక్తి లేని సామాన్యులను బెదిరిస్తూ కొడతాం, చంపుతామంటూ గుండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తానే స్వయంగా వచ్చి సమస్యపై స్పందించినా, పరిస్థితి మారలేదని తెలిపారు. తాను రావడానికి ముందు రోజు రాత్రే గుండాలు ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరించారని, సమావేశానికి వస్తే ఇబ్బందులు పెడతామని హెచ్చరించారని వెల్లడించారు. తాను అక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమైందని భావించానన్నారు. 2,086 మందికి చెందిన ప్లాట్లే తప్ప అక్కడ వ్యవసాయ భూమి లేదని స్పష్టంగా ఉన్నా, మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే పేరుతో అక్కడికి రావడం అనుమానాస్పదమని ఈటల రాజేందర్ అన్నారు. ఆ అధికారిపై కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సర్వేకు వచ్చినప్పుడు ఫ్లాట్ ఓనర్లను గుండాలు కొట్టిన తీరు బాధాకరమన్నారు.
వెంకటేశ్వర్‌పై హత్యా నేరం పెట్టాలి
“నేను ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదు. మిస్టర్ వెంకటేశ్వర్‌ను వదిలిపెట్టను” అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అతడికి మద్దతిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈటల రాజేందర్ తీవ్ర ప్రశ్నలు సంధించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించలేని వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి గుండాలకు మద్దతిస్తే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టర్‌ను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మీ నియంత్రణలో ఉందా లేదా అని నిలదీశారు.
ధరణి.. భూభారతి.. మారింది పేరు మాత్రమే!
ధరణి పేరుతోనూ, ఇప్పుడు భూభారతి పేరుతోనూ అదే గుండాలు, అదే ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఈటల మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్లాట్ కొనాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. వెంకటేశ్వరిపై హత్యా నేరం మోపి 24 గంటల్లో జైలుకు పంపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. 48 గంటల తర్వాత తీవ్ర పోరాటానికి దిగుతామని, ల్యాండ్ బ్రోకర్ల భరతం పడతామని స్పష్టం చేశారు. బాధితులకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు అండగా ఉంటారని, కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనని ప్రకటించారు.


