భూ తగాదాలు ఠాణాలో పరిష్కరించబడవు
*ప్రజల శాంతిభద్రతలకై 24 గంటలు అందుబాటులో ఉంటా
*గీసుగొండ సీఐ విశ్వేశ్వర్
కాకతీయ,గీసుగొండ: భూ తగాదాలు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు పోలీసు స్టేషన్లలో పరిష్కరించబడవని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషనులో భూతగాదాలు ఆర్థిక లావాదేవీలు సమస్యలు పరిష్కరించబడవని,అటువంటి సివిల్ తగాదాలను ప్రజలు సంబంధిత న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల కోసం 24 గంటలు కృషి చేస్తానని,ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలు, నేరాలు, ఇతరులను కించపరచే లేదా రెచ్చగొట్టే సామాజిక మాధ్యమ పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం మోపుతానని హెచ్చరించారు.ప్రజా రక్షణ, నేర నియంత్రణ,పరిశోధనకు సీసీ కెమెరాలు ఎంతో మేలు చేస్తాయని, వాటిని నివాసాల వద్ద, కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల వాడకం, రవాణా,నిల్వ చేయడం నేరమని గుర్తు చేశారు. అటువంటి సమాచారం లభించిన వెంటనే పోలీసు వారికి తెలపాలని కోరారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రజలు భయపడకుండా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ ఫిర్యాదులను సమర్పించాలని సీఐ సూచించారు.


