భూసేకరణ పూర్తి చేయాలి
పారదర్శకంగా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాకతీయ, జనగామ : భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వివిధ దశల పనితీరును ఆయన సమగ్రంగా పరిశీలించారు. యూనిట్–I పరిధిలో అవార్డు, పీఎన్ దశలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామాల వారీగా సంయుక్త తనిఖీలు నిర్వహించి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పెగ్ మార్కింగ్ పనులను నెల రోజుల్లో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. యూనిట్–II పరిధిలోని పెండింగ్ పనులను వారం రోజుల్లో, పెగ్ మార్కింగ్‌ను ఒక నెలలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ గడువు విధించారు. జనగాం ఆర్డీవో పరిధిలో అవార్డు దశలో ఉన్న భూసేకరణ పనులను కూడా వారం రోజుల్లో ముగించాలని ఆదేశించారు. చీతకోడూరు ఆర్‌ఎంసీకి సంబంధించిన అవార్డు విచారణను “సర్వే & పేమెంట్ వెరిఫికేషన్ టీం” ద్వారా సంయుక్త తనిఖీలతో పూర్తి చేయాలని, అశ్వరావుపల్లి ఆర్‌ఎంసీ భూసేకరణను కూడా వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగాం, ఘనపూర్ స్టేషన్ ఆర్డీవోలు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ వరంగల్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఈఈలు, డిప్యూటీ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.


