ఆకేరు వాగులో పడిన కూలీ మృతి
బర్రెలను కాపాడే ప్రయత్నంలో నీట మునిగి మృత్యువాత
గజ ఈతగాళ్ల సహాయంతో మరుసటి రోజు మృతదేహం గుర్తింపు
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుందర్ నాయక్ తండాకు చెందిన నేతవత్ రవి (35) అనే కూలీ ఆకేరు వాగులో మునిగి మృతి చెందాడు. బర్రెలను కాపాడేందుకు వాగులోకి దిగిన రవి తిరిగి బయటకు రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రవి నిత్యంలాగే తన యజమానికి చెందిన బర్రెలను జామస్తాన్‌పురం శివారులోని ఆకేరు వాగు వద్ద మేపుతుండగా, బర్రెలు వాగులోకి వెళ్లాయి. వాటిని బయటకు తీసుకురావడానికి చెప్పులు ఒడ్డునే వదిలి వాగులోకి దిగిన రవి తిరిగి బయటకు రాలేదు. అతనితో ఉన్న మరో కూలీ ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయగా, గ్రామస్థులు రాత్రి వరకు గాలించినప్పటికీ రవి జాడ కనిపించలేదు. రవి భార్య యాకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరుసటి రోజు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టగా ఉదయం 8 గంటల ప్రాంతంలో వాగు అడుగుభాగంలో రవి మృతదేహాన్ని గుర్తించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక మునిగిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై గొల్లమూడి ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


