కురిక్యాల హెచ్ ఎంపై సస్పెన్షన్ వేటు
బాలికలపై వేధింపుల ఘటనను దాచిపెట్టినట్లు ఆరోపణలు
కలెక్టర్ పమేలా సత్పతి కఠిన చర్యలు
ఇప్పటికే అటెండర్ యాకుబ్ పాషాను విధుల నుంచి తొలగింపు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మరిన్ని సంచలన మలుపులు తీసుకుంది. సంఘటనలో నిర్లక్ష్యం, వాస్తవాలు దాచిపెట్టినట్లు తేలడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ. కమలను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న ఎండి యాకూబ్ పాషా బాలికల బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ తక్షణమే ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు.
విచారణ కమిటీ సమర్పించిన నివేదికలో ప్రధానోపాధ్యాయురాలు కమల ఘటనను దాచిపెట్టడానికి పాఠశాల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు స్పష్టమైంది. దాంతో కలెక్టర్ పమేలా సత్పతి కఠినంగా స్పందించి ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను వదిలి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలతో అటెండర్ యాకూబ్ పాషాను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో కురిక్యాల పాఠశాల ఘటనపై జిల్లా విద్యాశాఖలో కలకలం రేగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.


