కేటీఆర్ అరెస్ట్ తప్పదు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూమార్ వ్యాఖ్యలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదని మంత్రి అడ్లూరి లక్ష్మన్ కూమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్, హరీష్‌రావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్, హరీష్‌ను ఉద్దేశించి బావా, బామ్మర్దులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు ఇప్పటికే తగిన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీఆర్ఎస్ నేతలు తమ స్వంత మీడియా, సోషల్ మీడియాలో అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. నిజంగా కుంభకోణం జరిగి ఉంటే నిర్ధారిత ఆధారాలు బయటపెట్టాలని బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని మంత్రి విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జీతాలు సమయానికి చెల్లడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు సాఫీగా అమలవుతున్నాయన్నారు. ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టే రోజులు పోయాయని కేటీఆర్ చేసిన తప్పులు త్వరలోనే బయటపడతాయని అరెస్టు తప్పదని మంత్రి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం పాటించాలని చీప్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని మంత్రి అడ్లూరి సూచించారు.


