కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిగ్గా మారింది. కాళేశ్వరం రిపోర్టుపై రాష్ట్ర శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సూచించారు.
కేటీఆర్ సూచనల మేరకు మండల కేంద్రాల నుంచి జిల్లా ప్రధాన కేంద్రాల వరకు పార్టీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీల రూపంలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రజల్లోకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయాలను బహిర్గతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.
కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్, ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి మూలస్థంభాలుగా నిలుస్తాయని, అలాంటి ప్రాజెక్టులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ వర్గాల ప్రకారం, ఈ ఆందోళనల ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సందేశం బలంగా చేరేలా వ్యూహరచన చేపడుతోంది. మొత్తానికి, కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి దిగితే, కాళేశ్వరం అంశం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయమని చెప్పవచ్చు.
అటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హరీశ్ రావు తరపున న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలంటూ కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు అన్నారు. అసెంబ్లీలో తీర్మానించకుండానే సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. దీనిపై పదే పదే హరీశ్ రావు తరపు న్యాయవాది అభ్యర్థించినా కోర్టు అంగీకరించలేదు.


