కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి డ్రగ్స్ కేసు హాట్‌టాపిక్ మారింది. మహారాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 21 నెలలుగా ఆ డ్రగ్స్ కంపెనీ తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వ్యవహారంలో ఎలాంటి ముడుపులు అందాయా? అంటూ ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసులు అణచివేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోంమంత్రిత్వ శాఖ, ఈగల్ టీమ్, హైడ్రా టీమ్ లాంటి విభాగాలు ఉన్నప్పటికీ, ఈ స్థాయి పెద్ద రాకెట్‌ను బయటపెట్టడంలో విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర పోలీసులు 21 నెలలుగా శ్రమించి డ్రగ్స్ కంపెనీపై రైడ్స్ చేశారు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం కేసీఆర్ పాటలు పెట్టిన డీజే బాక్సులు స్వాధీనం చేసుకోవడంలో, సోషల్ మీడియాలో రీట్వీట్ చేసిన వారిపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల భద్రతను పక్కనబెట్టి రాజకీయ ప్రతీకారాలతోనే పోలీసులు పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఉధృతంగా పెరుగుతుండగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నిజమైన విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


