కేటీఆర్‌కు సిగ్గుండాలె
ఇప్పుడు సంసారి లెక్క మాట్లాడుతుండు
కేసీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయాలె
టెర్రరిస్ట్ పేరుతో నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు
మావోయిస్టుల జాబితాలో హీరోయిన్ల పేర్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి
మంత్రులు ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు
హైదరాబాద్‌లో రోహింగ్యాలకు వంతపాడుతున్న పాలకులు
మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ .. తమ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దేవుడిపై ప్రమాణం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తన ఫోన్ కూడా టెర్రరిస్ట్ పేరుతో ట్యాంపరింగ్ చేశారని మండిపడ్డారు. తాము ఎలాంటి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదని చెప్పడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఎన్ని కుటుంబాలను, ఎంత మంది జీవితాలను నాశనం చేశాడో గుర్తు చేసుకోవాలన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ లేఖ రాస్తే.. బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా ? అని మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారని ప్రస్తావించారు.
దోపిడీపై విచారణ జరపాలి..
సింగరేణిలో రెండు పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే.. గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతోందని ఆరోపించారు. సింగరేణిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో టైంపాస్ చేయొద్దని బండి అన్నారు. సింగరేణి అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో అవి తారుమారు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్పిన రూ.42 వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సింగరేణిని అప్పుల పాల్జేసింది..
‘కేసీఆర్ పాలనలో సింగరేణిని దోచుకుంది ఆయన కుటుంబమేనని బండి సంజయ్ విమర్శించారు. ఆ సొమ్ముతోనే బీఆర్ఎస్‌ను ఇన్నాళ్లూ నడిపించారని ఆరోపించారు. ‘రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంది. సింగరేణిని అప్పుల పాల్జేసింది. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం పరిపాటైంది. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే. మా బాగోతం మీరు బయటపెడితే.. మీ బాగోతం మేం బయటపెడతామంటూ మాట్లాడుకుంటున్నారు. మరో వారం రోజుల తర్వాత సింగరేణి బాగోతాన్ని దారి మళ్లించేందుకు మరో అంశాన్ని తెరపైకి తెస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
క్లీన్ చిట్ ఇస్తోందా.?
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతున్నారు. విచారణకు పిలిచామని సీపీ సజ్జనార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీశ్‌రావులతో సహా అందరినీ సాక్షిగా పిలిస్తే.. అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు? ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటి? సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేసినట్లే. ఇప్పటికైనా సిట్‌కు స్వేచ్ఛనివ్వాలి. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ప్రజలను దోచుకున్న కేసులన్నీ కేసీఆర్ కుటుంబానికి లొట్టపీసు కేసుల్లాగే కనిపిస్తాయి. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉంది’ అని విమర్శించారు బండి సంజయ్.
నన్ను విచారణకు పిలిచారు..
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిచి నా ఫోన్ ట్యాప్ అయ్యిందని, మావోయిస్టు జాబితాలో నా పేరును చేర్చారని చెప్పారు. మరి అందుకు కారకులైన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కాంగ్రెస్ స్కాంలు బయటపడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో డ్రామాలాడుతున్నారు. కేటీఆర్ పెద్ద నిజాయతీపరుడిలా మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎంత మంది జీవితాలను నాశనం చేశారో తెలియదా? నిజామ్ అరాచకాలను మరువలేదు.. నీ అరాచకాలను కూడా మర్చిపోలేం. కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్.. నా ఛాలెంజ్‌కు సిద్ధమా? దేవుడి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా? మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను చేర్చింది నిజం కాదా? ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా? ఇంకా సిగ్గులేకుండా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతారా? నేను సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలాడతారు. పోనీ ఆ లీగల్ నోటీసులకైనా కట్టుబడి ముందుకు సాగుతారా? అంటే.. మధ్యలోనే పారిపోతారు’ అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.
పాతబస్తీలోకి అక్రమంగా రోహింగ్యాలు..
‘రోహింగ్యాలు 2014కు ముందే పాతబస్తీలోకి అక్రమంగా ప్రవేశించారు. వారికి రేషన్ కార్డులు, ఓటర్ కార్డులిచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. బీఆర్ఎస్ పాలనలో నాటి హోంమంత్రి.. వారికి ఇళ్లు మంజూరు చేసి మద్దతిచ్చారు. రాష్ట్ర పాలకులే ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు వంతపాడుతుంటే.. శాంతిభద్రతలను కాపాడేదెవరు?’ అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.


