కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల బండి సంజయ్ మీడియా సమావేశంలో కేటీఆర్ పై చేసిన ఆరోపణలు అడ్డగోలుగా, అసత్య పూరితంగా, ఆధారాలు లేనివిగా ఉన్నాయని నోటీసులో కేటీఆర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
కేంద్రమంత్రిగా ఉన్నత పదవిలో ఉండి బాధ్యతారహితంగా మరొక ప్రజాప్రతినిధిపై తప్పుడు ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం, స్వీయ రాజకీయ ఉనికిని కాపాడుకు నేందుకు బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
నోటీసులో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవడంతో పాటు, కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత ముదురుతోంది.


