కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆఱ్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న బసరత్ ఖాన్ విచారణలో సంచలన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన స్మగ్గింగ్ నెట్ వర్క్ ద్వారా దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చిన వెహికల్స్ లో ఒకటి కేటీఆర్ వాడుతున్నట్లు ఆయన అంగీకరించారని డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
డీఆర్ఐ అధికారులు బసరత్ ఖాన్‌ను విచారించగా.. అతను మొత్తం 8 ల్యాండ్ క్రూజర్ వాహనాలను స్మగ్లింగ్ చేశానని చెప్పినట్లు తెలిపారు. ఆ వాహనాల నంబర్లను కూడా అధికారులు ముందు ఉంచినట్లు సమాచారం. వాటిలో కేటీఆర్ వాడుతున్నట్లు చెబుతున్న టీఎస్09డి 6666 నంబర్ వాహనం కూడా ఉన్నట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. డీఆర్ఐ అధికారులు ఆ వాహనాన్ని ట్రాక్ చేస్తే.. అది “ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీసెస్” పేరుతో రిజిస్టర్ అయిందని గుర్తించారు. ఈ కంపెనీపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ఎట్ హోం కంపెనీకి కేటీఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారని సమాచారం.
ఇప్పటికే పలు వివాదాలతో కేటీఆర్ పేరు రాజకీయంగా చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు స్మగ్లింగ్ కేసులో బసరత్ ఖాన్ వాంగ్మూలం ఆయనకు కొత్త తలనొప్పిగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అక్రమంగా దేశంలోకి వచ్చిన ల్యాండ్ క్రూజర్ వాహనాలు వాడుతున్నారనే ఆరోపణలు ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసే అవకాశముంది. బసరత్ ఖాన్ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ వాహనాలను విదేశాల నుంచి చౌకగా తెచ్చి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించి, కొంతమందికి అందజేశాడు. ఈ రాకెట్‌లో పలు ప్రముఖులు ఉన్నారని కూడా డీఆర్ఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన వాహన నంబర్ల ఆధారంగా కేసును విస్తరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


