కాకతీయ, ములుగు : ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ జీతాలు రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగులమందు తాగి ఇటీవల మృతి చెందిన ఘటనపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రెడ్‌కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్‌లో మృతుని తల్లితో మాట్లాడారు. మృతుని తల్లి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతం రాక మనస్థాపంలో కొడుకు మృతి చెందాడు అని, జీతం కోసం తిరిగి తిరిగి బాధపడుతూ చివరికి మున్సిపాలిటీ ఇచ్చిన గడ్డి మందు తాగి చనిపోయాడు అని వేదన వ్యక్తం చేశారు. మృతుడి తల్లి కన్నీటి పర్యంతమై, నా కొడుకుకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అని, గతంలో ఒక పాప జ్వరంతో చనిపోయినప్పుడు కూడా జీతం రాలేదు అని, ఆ సమయంలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఆరు నెలలుగా జీతం లేక అవస్థలు పడ్డాడు అని తెలిపింది.
బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంమని, కేసీఆర్ తరఫున ముగ్గురు ఆడబిడ్డలకు సాయం అందిస్తాం అని, రెండు రోజుల్లో సాయం చేరుతుంది ఎలాంటి ఆందోళన చెందవద్దు అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని, మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం అని స్పష్టం చేశారు.


