- ఇంటి స్థలం, కంటి చికిత్స బాధ్యత స్వీకరించిన కెటిఆర్..
కాకతీయ, హైదరాబాద్ సిటీ బ్యూరో : తెలంగాణ జానపద సాహితీ ప్రియులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శనివారం మొగులయ్య కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆరా తీశారు. మొగులయ్య తన కంటి చూపు మందగించి చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పగా, కేటీఆర్ వెంటనే స్పందించి ఆయనకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్స అందేలా బాధ్యత స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇంటి స్థల సమస్యపై కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్..
ఈ సందర్భంగా మొగులయ్య, గత ప్రభుత్వం హయత్‌నగర్ మండలంలో తనకు కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తులు సృష్టిస్తున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి, మొగులయ్యకు సంబంధించిన భూవివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మొగులయ్య కట్టుకున్న గదిని కొంతమంది కూల్చివేశారని ఆయన కలెక్టర్‌కు వివరించగా, భూమికి, కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కేటీఆర్ సూచించారు. అవసరమైతే న్యాయపరమైన సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌కు మొగులయ్య కృతజ్ఞతలు..
మొగులయ్య మాట్లాడుతూ.. అడవుల్లో కిన్నెర వాయించుకునే నాకు గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ ప్రేమే. ఆయన వల్లే నా కళ ప్రపంచ దృష్టికి చేరింది. పద్మశ్రీ అవార్డు కూడా ఆయన ఆశీర్వాదంతోనే దక్కింది. ఆయన చేసిన సహాయం జీవితాంతం మరచిపోలేను, అన్నారు. తన ఇంటి స్థలం వివాదం పరిష్కరించడంలో కేటీఆర్ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.


