రూ.12.15 కోట్లతో యాదాద్రి తరహాలో కోటంచ అభివృద్ధి
వరంగల్ ఎంపీ కడియం కావ్య
కాకతీయ, రేగొండ : రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గురువారం సందర్శించారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.12.15 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టిందని తెలిపారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులతో పాటు అతిథి గృహాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. యాదాద్రి తరహాలో కొడవటంచ ఆలయాన్ని అభివృద్ధి చేసి గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ–వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


