ఘనంగా కొటమైసమ్మ ఉత్సవాలు
భక్తజన సందోహంతో ఆలయం కిటకిట
కాకతీయ, కారేపల్లి : గ్రామాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు ఐక్యతను పెంపొందిస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పగడాల మంజుల తెలిపారు. ఆదివారం సింగరేణి గ్రామంలోని శ్రీ కొటమైసమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగిన వేడుకలు చివరి రోజు భక్తి భావంతో పతాక స్థాయికి చేరుకున్నాయి. పగడాల మంజుల మాట్లాడుతూ, ఇలాంటి వేడుకలు ప్రజల్లో శాంతి, ఐక్యతను పెంచుతాయని అన్నారు. అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త పర్సా పట్టాభి రామారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చారణలతో మార్మోగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.


