జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కోరుట్ల ఎమ్మెల్యే ఫైర్
దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రా – డా. సంజయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం కరీంనగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రి విద్యాసాగర్‌రావు రాజకీయాల్లోకి రాకముందే ఏ క్లాస్ కాంట్రాక్టర్ అని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌గా మారిన వారు ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. జగిత్యాల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీకెందుకు బాధ అంటూ వ్యాఖ్యానించారు. జిల్లా మెడికల్ కాలేజీ ఒక్కరి సొంతం కాదని, అది జిల్లా ప్రజలందరిదని స్పష్టం చేశారు. అక్కడ చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని తెలిపారు. జగిత్యాలకు మెడికల్ కాలేజీ తన సిఫారసుల వల్లే వచ్చిందన్న వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనలేనివని మండిపడ్డారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే మెడికల్ కాలేజీలు మంజూరవుతాయన్న విషయం ఒక డాక్టర్ అయ్యుండి నీకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఆరోగ్య చికిత్స కోసం జగిత్యాల ఎమ్మెల్యే హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కోరుట్ల ప్రజలు జగిత్యాలకు వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమై రెండేళ్లు పూర్తయ్యాయని, మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి పనులు గత ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రులకు అవసరమైన సిబ్బంది కేటాయింపులో పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. అభద్రతా భావంతో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే కనీస అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే నిజాలు తెలుస్తాయని, బయట తిరుగుతూ మాట్లాడితే వాస్తవాలు తెలియవని ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్వలాభం కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దమ్ముంటే పదవికి రాజీనామా చేసి జగిత్యాలలో తనతో నేరుగా పోటీకి రావాలని సవాల్ విసిరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా అవసరమైతే ముఖ్యమంత్రిని తానే కలుస్తానని స్పష్టం చేశారు. సన్న వడ్లకు బోనస్, కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వడం లేదో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని హితవు పలికారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, తనపై ఎంత మాట్లాడినా జగిత్యాల ఎమ్మెల్యే కుటుంబాన్ని మాత్రం తాను ఎప్పటికీ విమర్శించనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మారు సాయిరెడ్డి, దారిశెట్టి రాజేష్, దశరథ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఫహీం, భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


