కౌంటింగ్ హాల్ వద్ద ‘కొండముచ్చు’
కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు అధికారుల నిర్ణయం
కాకతీయ, సిరిసిల్ల టౌన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సిరిసిల్లలోని సినారే కళామందిరంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించారు. అయితే, లెక్కింపు కేంద్రం వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో అధికారులు తీసుకున్న ఓ వినూత్న చర్య ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కోతులను భయపెట్టేందుకు లెక్కింపు కేంద్రం ప్రాంగణంలో కొండముచ్చు ఫోటోను ఏర్పాటు చేశారు. సాధారణంగా అడవి జంతువుల చిత్రాలను చూసి కోతులు దగ్గరకు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. భద్రతాపరంగా పోలీసులు భారీగా మోహరించగా, లెక్కింపు కేంద్రంలోకి అనుమతిపత్రాలు ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తానికి, కోతుల బెడదను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ‘కొండముచ్చు’ ఫోటో ప్రస్తుతం సిరిసిల్లలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.


