కొమురయ్య స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శి
మహనీయుల ఆశయాలు అందరూ ఆచరించాలి
బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి
కాకతీయ, పెద్దపల్లి : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి త్యాగధనుడిగా కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన పోరాటం సమాజానికి ఆదర్శమని చెప్పారు. మహనీయులను ఒక కులం లేదా వర్గానికి పరిమితం చేయకుండా వారి ఆశయాలను అందరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. యువత కొమురయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


