కాకతీయ, బయ్యారం : తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ బయ్యారం మండలకమిటీ (జాక్) ఆధ్వర్యంలో స్థానిక రామాలయం సెంటర్ లో కొమురం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆదివాసులకు చెందాల్సిన రిజర్వేషన్లను 50సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డి దారిన వచ్చిన వారికి దోచిపెట్టడం వల్ల , నేడు ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అందుకు నిరసనగా ‘మా ఊళ్ళో మారాజ్యం’ అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 1978 సంవత్సరం తర్వాత దొడ్డిదారిన వచ్చిన వారికి రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతానికి వలసలు వచ్చిన వారికే ఆదివాసులకు చెందవలసిన పోడు భూములపైన గుత్తాధిపత్యానికి సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలను భూములకు దూరం చేస్తున్న అధికారుల నుంచి హక్కులను కాపాడుకోవాలంటే ప్రస్తుతం ఉద్యమించాల్సిన పరిస్థితి దాపురించిందని వారు పేర్కొన్నారు. వచ్చేనెల మూడున ఏటూరు నాగారం ఐటీడీఏ వద్ద సభకు అధిక సంఖ్యలో ఆదివాసి సమాజం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ చైర్మన్ వర్స ప్రకాష్, కమిటీ సభ్యులు మెస్సు రాజశేఖర్, కొటెం పుల్లయ్య, పోలేబోయిన రామనర్సయ్య, వట్టం శ్రీను, ఇర్ప రామారావు, వర్స కన్నయ్య, కోరెం జంపన్న, చుంచు ప్రశాంత్, చుంచు నర్సయ్య, కొటెం విజయ్, కొటెం సూర్యనారాయణ, కోటెం నారాయణ తదితరులు పాల్గొన్నారు.


