కాకతీయ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి ఎదురు నిలబడి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం, వారి హక్కుల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
RRR ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. స్థానిక ప్రజల ఇళ్లు, భూములు కోల్పోతున్న నేపథ్యంలో వారికి న్యాయం జరిగేలా కచ్చితంగా ఒత్తిడి తెస్తానని ప్రభుత్వానికి హెచ్చరించారు. భూ నిర్వాసితుల పక్షాన తాను ఎల్లప్పుడూ నిలుస్తానని, ఆ హక్కులను సాధించడంలో వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. అలాగే తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విషయాలపై కూడా కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన సమయంలో తాను మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. అయితే అది ఆలస్యమైనా పర్వాలేదని, తనకు ప్రజాసేవే ముఖ్యమని అన్నారు. సరైన సమయానికి మంత్రి పదవికి వస్తాననే నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ పదవుల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, మునుగోడు అభివృద్ధి కోసం ఎంత కష్టమైనా పడతానని ఆయన హామీ ఇచ్చారు. “నా నియోజకవర్గ ప్రజలే నా బలం. వారి కోసం ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధం” అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇకపై మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోనని, అవసరమైతే అధికారంలో ఉన్న ప్రభుత్వానికే సవాల్ విసరడానికి వెనుకాడనని మరోసారి స్పష్టం చేశారు.


