- మునుగోడులో మద్యం దుకాణాలకు నయా రూల్స్
- ప్రభుత్వ నిబంధనలు నియోజకర్గంఓ కుదరవ్..
- స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి
- వైన్ షాప్ లు ఊరి బయటే ఏర్పాటు చేయాలి
- నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవు
- సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్ మెసేజులు వైరల్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ మద్యం సిండికేట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు లిక్కర్ వ్యాపారులకు సవాల్ గా మారాయి. “రాజన్న రూల్స్..” పాటించాల్సిందేనని హుకుంజారీచేశారు. వైన్ షాప్స్ నిర్వాహకులు.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు తన నియోజకవర్గంలో పాటించవద్దంటూ లిక్కర్ వ్యాపారులకు, అధికారులను హెచ్చరించారు. రాజన్న రూల్స్ మాత్రమే పాటించాలనే నిబంధన విధించారు. మునుగోడులో రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని స్పష్టంచేశారు.
ఈమేరకు ఆదివారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో మద్యం దుకాణ టెండర్లపై నాయకులతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన కామెంట్స్ ను సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్ వైరల్ చేశారు.
వాళ్లు టెండర్లు వేయొద్దు..
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి… ఇతర మండలానికి చెందిన వాళ్ళు అనర్హులని ప్రకటించారు. వైన్ షాప్ లు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలి, ఇళ్ల మధ్యలో విరుద్ధం అన్నారు. వైన్ షాప్ కు అనుబంధం గా (సిట్టింగ్) పర్మిట్ రూమ్ ఉండవద్దు అని స్పష్టంచేశారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని, లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్ ల నిర్మూలన, మహిళల సాధికారతే మా ఉద్దేశం అన్నారు. ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేయవద్దు, నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు పడవద్దు అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు.


