కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్
34 మంది కార్పోరేటర్ల మద్దతుతో బీజేపీ అభ్యర్థి కైవసం
డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు ఎన్నిక
ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్
క్యాంపు రాజకీయాలతో.. సభ్యుల సమీకరణలో కమలం విజయం
ఘనంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం
నగర పాలనలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగర రాజకీయాల్లో ఉత్కంఠభరితంగా సాగిన మేయర్ ఎన్నికల పోరుకు తెరపడింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ 34 మంది సభ్యుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని నగర పాలనపై కమలం పార్టీ ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటింది. డిప్యూటీ మేయర్‌గా 42వ డివిజన్‌కు చెందిన యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు. ఈ ఫలితంతో కరీంనగర్ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మేయర్ ఎన్నికల ప్రక్రియలో బీఆర్‌ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండటం కీలక మలుపుగా మారింది. దీంతో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా సంఖ్యాబలం సమీకరించుకునే అవకాశం లభించింది. ఈ పరిణామం కమలం పార్టీకి నిర్ణాయక ఆధిక్యాన్ని అందించడంతో మేయర్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది. ఎన్నికల అనంతరం జరిగిన కార్యక్రమంలో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా, యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికతో నగర పాలనలో బీజేపీ ప్రభావం మరింత బలపడింది.
ఫలించిన బండి సంజయ్ వ్యూహాలు
కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అమలు చేసిన వ్యూహాలు బీజేపీ విజయానికి కీలకంగా మారినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గెలిచిన కార్పొరేటర్లను క్యాంపులో ఉంచి, ఓటింగ్ సమయంలో సమన్వయంతో తీసుకువచ్చి మద్దతును కాపాడుకోవడం నిర్ణాయకంగా నిలిచింది. సభ్యుల సమీకరణలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ, వ్యూహాత్మక ముందుచూపుతో బీజేపీ శ్రేణులు వ్యవహరించడంతో మేయర్ పీఠంపై ఆధిపత్యాన్ని ఖాయం చేశాయి. ఈ వ్యూహాత్మక కదలికలు నగర రాజకీయాల్లో బీజేపీ బలం పెరిగిన సంకేతంగా భావిస్తున్నారు.
కొత్త పాలనకు నాంది
కరీంనగర్ నగరపాలక సంస్థ నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో ఆథరైజ్డ్ ఆఫీసర్ మహేశ్వర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ పమేలా సత్పతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో కరీంనగర్ నగర పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొత్త పాలకవర్గం నగర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతోంది.


