మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం
రూ.49 లక్షల అభివృద్ధి పనులకు తొలి సంతకం
కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కొలగాని శ్రీనివాస్ మేయర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పదవిలో ఆసీనులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని విలీన గ్రామాల డివిజన్లలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.49 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు పరిపాలనాపరమైన మంజూరుపై తొలి సంతకం చేశారు. పైప్‌లైన్ మరమ్మతులు, వాల్వ్ మార్పులు, లీకేజీల నివారణ, ఓపెన్ వెల్ తవ్వకం, పంపింగ్ వ్యవస్థ బలోపేతం వంటి పనులు చేపట్టి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించడమే లక్ష్యమని తెలిపారు.
నగర అభివృద్ధే లక్ష్యం
నూతనంగా విలీనమైన గ్రామాల డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేసి నగరంలోని 66 డివిజన్లకు మెరుగైన మౌలిక వసతులు, వేగవంతమైన పౌర సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పదవి దక్కడంలో సహకరించిన నగర ప్రజలకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు, అధికారులు మేయర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


