కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవుల నుంచి తొలగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆరోపణలతో జైల్లోకి వెళ్తే పదవి నుంచి వైదొలగాలని ఆయన అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రివాల్ ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు అక్కడే అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టారంటూ విమర్శలు చేశారు. జైలు నుంచే పాలన చేసి ప్రభుత్వ యంత్రాంగాన్నిభ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు.
తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ జైలుకి వెళ్లిన రాజీనామా చేయలేదన్నారు. ప్రభుత్వాలను కాపాడే నేతలు, పాలకులకు నైతిక విలువలు అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు నాయకులు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. దీనితో కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ తీసుకువస్తుందని తెలిపారు. దీనికోసం లోకసభలో బిల్లు పెట్టామన్నారు. ఈ బిల్లును ఏకపక్షంగా తీసుకురావాలని అనుకోవడం లేదన్నారు.
జేసీసీ ద్వారా దేశంలోని ప్రజలు మేధావులు, విద్యావంతులు రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. లోకసభలో పెట్టిన బిల్లు వల్ల దోచుకున్న వారికి కొంత బాధ కలుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో జరిగే మూడో రాష్ట్రాలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందిన ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.


