ముగిసిన ఖిల్లా మైసమ్మ జాతర
భారీగా తరలివచ్చిన భక్తులు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ఆదివాసీ,నాయక్ పోడ్ ఆధ్వర్యంలో ఆచార సాంప్రదాయాల పద్ధతితో మూడు రోజుల పాటు నిర్వహించే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారంతో ముగిసింది. శుక్ర,శని వారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఆలయ కమిటీ వారు కల్పించారు. ఆదివాసీల చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ దేవర,భైరవుడు,చిన్నయ్య – పెద్దయ్య,గుట్టపై నాగ శేషుడు,గాంధారి ఖిల్లా మైసమ్మ,సదర్ల బీమన్న గజాలు,గట్టమ్మ తల్లులను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా మాజీ చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గుట్ట కింద ఏర్పాటు చేసిన దర్బార్ వేదికగా మాట్లాడారు. అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జాతర కోసం కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. బొక్కల గుట్ట గ్రామం నుంచి ఖిల్లా గుట్ట వరకు రహదారి నిర్మాణం చేయించినట్లు చెప్పారు. ఈ జాతరలో ఆదివాసి,నాయక్ పోడ్ రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



