విషమిచ్చి చంపండి
ఇప్పటికే సగం చనిపోయా
మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు
రేటింగ్స్ కోసం మానసిక హింసకు గురిచేయొద్దు
ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందన్న విషయం గుర్తించాలి
కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలోనే..
సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా
రేపటి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదు
మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆవేదన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాలో వస్తున్న కొన్ని కథనాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మహిళా ఐఏఎస్ అధికారులపై, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్న తనపై ఇలాంటి బురదజల్లడం సరికాదని ఆయన మీడియాకు విన్నవించారు. తనను ఎంతైనా విమర్శించవచ్చని.. కానీ అధికారులను వివాదాల్లోకి లాగొద్దని ఆయన కోరారు.
వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదు
మంత్రి తన ఆవేదనలో ప్రధానంగా మహిళా అధికారుల ఆత్మగౌరవం గురించి ప్రస్తావించారు. ఐఏఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటారని.. కేవలం ఛానళ్ల మధ్య పోటీ కోసం వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డుపైకి లాగడం సరికాదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆధారం లేని వార్తల వల్ల వారు ఎంతటి మానసిక వేదనకు గురవుతారో ఆలోచించాలని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం తరపున సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతానని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని.. తన కుమారుడి మరణం తర్వాత సగం చనిపోయానని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
పాత ఫోన్ నంబరే వాడుతున్నా..
గత కొంతకాలంగా మంత్రి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అమెరికా వెళ్లి వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు తక్కువగా మాట్లాడుతున్నట్లు వివరించారు. తాను ఫోన్ నంబర్ మార్చానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. గత 20 ఏళ్లుగా వాడుతున్న పాత నంబర్ తన వద్దే ఉందని.. అందరూ ఫోన్లు చేస్తుండటంతో దానిని తన పీఏ వద్ద ఉంచానని క్లారిటీ ఇచ్చారు. ఆ నంబర్ ద్వారానే తాను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తు చేశారు. కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో జరుగుతాయని.. ఇందులో మంత్రుల ప్రమేయం ఉండదని చెప్పారు. నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పరిపాలనాపరమైన ప్రక్రియే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తేల్చి చెప్పారు.
సినిమా టికెట్ల ధరల పెంపుపై..
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై తన దగ్గరకు రావొద్దని చెప్పానని.. దీంతో ఎవరూ తనను కలవడానికి రావడం లేదని చెప్పారు. పుష్ప సినిమా సందర్భంగా ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అప్పటి నుంచే టికెట్ల రేట్ల పెంపు కోసం తన దగ్గరకు రావొద్దని చెప్పానని ఆయన అన్నారు. నిన్నటి సినిమాకు టికెట్ల ధరల పెంపు, రేపటి సినిమాకూ టికెట్ రేట్లు పెంచిన విషయం తనకు తెలీదని చెప్పారు. టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలీదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
అవసరమైతే హెలికాఫ్టర్‌లో తరలిస్తాం..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బాటిల్ నెక్ ప్లేస్ ఉన్న వద్ద జామ్ ఎక్కువ అవుతోందన్నారు. ఈసారి 12 లక్షల వాహనాలు వెళతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈరోజు నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుందని.. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు టోల్ ఛార్జీ లేకుండా గేట్ ఎత్తేయాలని చెప్పామని అన్నారు. ప్రత్యామ్నాయ రూట్స్‌లో ప్రయాణికులు వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదం జరిగితే అవసరమైతే హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


