సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రికార్డు
మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి!
సాగునీటి–విద్య–వైద్య రంగాల్లో వేగంగా అభివృద్ధి
భారీ పరిశ్రమలతోనే యువతకు ఉపాధి
ఖమ్మానికి ఇండస్ట్రియల్ పార్క్ అవసరం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సమిష్టిగా పనిచేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
జిల్లాలో ఉన్నత విద్యను విస్తరించేందుకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్టు, వైద్య రంగంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించినట్టు డిప్యూటీ సీఎం వివరించారు. సాగునీటి పారుదలలో భాగంగా మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి ఉపాధి కల్పించడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే ఖమ్మం జిల్లాకు ఒక భారీ ఇండస్ట్రియల్ పార్క్‌ను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలిపారు. అలాగే జిల్లాకు మరిన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు మంజూరు చేయాలని, అభివృద్ధిలో ఖమ్మాన్ని రాష్ట్రంలో ముందువరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు.


