కాసుల వేటలో ఖాకీ!
కర్తవ్యాన్ని మరిచి వసూళ్లు..
సెటిల్‌మెంట్లకు అడ్డగా పలు ఠాణాలు
ఏసీబీకీ చిక్కుతున్నా మారని తీరు
పోలీసుశాఖలో పెచ్చుమీరిన అక్రమాలు
సామాన్యులను సమిధలు చేస్తూ వసూళ్ల బేరం
అమాయకులనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపణలు
ఓవైపు అక్రమ వ్యవహారాలు, మరోవైపు లంచాలు !
డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెస్తున్న కొందరు అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాసుల కోసం కొందరు ఖాకీలు కర్తవ్యాన్ని మరిచి అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా బరితెగించి వసూళ్లకు తెగబడుతున్నారు. సెటిల్‌మెంట్లు, భూపంచాయితీల్లో మునిగితేలుతూ మొత్తం పోలీస్ శాఖకే చెడ్డపేరు తెస్తున్నారు. ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో స్టేషన్లలో కొందరు సీఐలు, ఎస్సైలది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. సివిల్ సెటిల్మెంట్లు, భార్యాభర్తల పంచాయితీ, ఇతర దందాల్లో తలదూర్చుతూ స్టేషన్లను అవినీతికి అడ్డాగా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఇటీవల సీఐల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్స్ లెటర్లతో పోస్టింగ్ తెచ్చుకుంటున్న పలువురు సీఐలు, ఎస్సైలు వారితోపాటు అనుచరుల సూచనల మేరకే పనిచేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దీంతో సామాన్యుల సమిధలుగా మారుతున్నారని, అమాయకులనే టార్గెట్ చేస్తున్నారన్న అపవాదు మూటగట్టు కుంటున్నారు.
సీఐ, ఎస్సైకి గతంలో మెమోలు !
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిలోని కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. నగరానికి అనుకొని ఉన్న తన పరిధిలోని మూడు ఠాణాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు సొంత శాఖలోనే వ్యక్తం అవుతున్నాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చడం, ప్రైవేటు పంచాయతీలు, సామాన్యులను బెదిరించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారిందనే వాదన ఉంది. అంతేగాక.. డ్రంకెన్ డ్రైవ్ పేరిట చిత్రహింసలకు గురిచేయడం, రూ. లక్ష తీసుకొని గంజాయి కేసులో ఇరికించడంలాంటి ఘటనలు డిపార్ట్‌మెంట్‌లో కలకలంరేపాయి. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణలపై సీఐతోపాటు ఎస్సైకి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మెమోలు జారీచేయడం డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వరుస ఘటనలతో సదరు అధికారి పేరు కమిషనర్ పరిధిలో చర్చనీయంగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
సిబ్బందితో వేధింపులు
మూడు ఠాణాల పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య, వైన్స్ ల నుంచి నెలవారీ మామూళ్లు పెంచాలని ఓ సీఐ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరంతా సీపీకి ఫిర్యాదు చేయాలని చూడగా విషయం తెలిసి ఓ మాజీ ప్రజాప్రతినిధి జోక్యంతో యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకు న్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తనపై ఫిర్యాదు చేయాలనుకున్న వారిపై ఇటీవల తన కిందిస్థాయి సిబ్బందితో సదరు అధికారి బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
క్వారీ యజమాలే టార్గెట్
వరంగల్ నగరానికి కూతవేటు దూరంలోని మైనింగ్ ఎక్కువగా జరిగే మండలంలో విధులు నిర్వహిస్తున్న సీఐ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. క్వారీ యజమాలను బెదిరించడం, ఇసుక వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడడం, సివిల్ తగాదాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇసుక, బియ్యం వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
గంజాయి రవాణాదారుడికి బెదిరింపులు
నగర శివారులో గల ఠాణాలో పనిచేస్తున్న ఓ సీఐపైనా ఇటీవల వరుసగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి అక్రమ వసూళ్లలో ఆరితేరారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల బైక్‌పై గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ రాత్రివేళ పట్టుకున్నారు. సీఐకి సమాచారం ఇవ్వగా కేసులో ఇరికిస్తామని బెదిరించి సదరు వ్యక్తి నుంచి రూ. లక్ష వసూలు చేసి వదిలేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.



