కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుగుతాయి. అయితే ఎక్కువ మంది మాత్రం ఖైరతాబాద్ వినియకుడి అంటే ఆసక్తి చూపిస్తుంటారు. మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ఉండటంతో ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహనిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఈ విగ్రహానికి ప్రస్తుతం ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నాయకత్వంలో రంగులు అద్దుతున్నారు. ప్రతిసంవత్సరం వినాయక చవితికి విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తున శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరనున్నాడు. ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే చవితి వేడుకల్లో ప్రతిష్టించే గణేశ్ విగ్రహనమూనా చిత్రాన్ని జూన్ 6వ తేదీన విడుదల చేశారు.
వినాయక చవితి మరో నాలుగు రోజులు ఉందనగానే మహా గణపతిని చూసేందుకు సందర్శకుల తాకిడ పెరిగింది. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో హడావుడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి రెండు రోజుల ముందుగానే సందర్శకులను అనుమతిస్తారు. మహాగణపతి శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమేతంగా రూపుదిద్దుకుంటున్నాడు. పక్కనే పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముల సమేతంగా, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ముస్తాబు చేశారు. మండపాల్లో కుడివైపున కన్యకాపరమేశ్వరి ఎడమవైపు గజ్జెలమ్మ విగ్రహాన్ని సిద్ధం చేశారు. సెప్టెంబర్ 6న మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు.


