కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవోపేతంగా సాగింది. ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం 1:40 నిముషాలకు హుస్సేన్ సాగర్‌లో మహాగణపతిని నిమజ్జనం చేశారు.
మహా గణపతిని కనులారా వీక్షించేందుకు మహానగర ప్రజలు లక్షలాదిగా ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్నారు. దీంతో ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో గణపతులను నిమజ్జనం చేయడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. 30 వేల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
భక్తుల కోసం జీహెచ్ఎంసీ అధికారులు మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్స్, తాగునీటి వసతి కల్పించారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్ ప్రకారమే గణేషుల శోభా యాత్ర కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు పోలీసులు ఆంక్షలు విధించారు. భక్తులు కాలినడక ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు.



