బీజేపీ నేతల జోలికి వస్తే ఖబర్దార్
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
సర్పంచ్ అభ్యర్థి పై దాడికి ఖండన
కాకతీయ, కరీంనగర్ : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి దండు కొమురయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన నేపథ్యంలో శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా,మండల నాయకులతో కలిసి కొమురయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొలంగూర్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న దండు కొమురయ్య శుక్రవారం రాత్రి తెనుగు వాడలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పిట్టల కొమురయ్యను పరామర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కారంపొడి చల్లి, ఛాతీ, పొట్ట, ముఖంపై పిడిగుద్దులు గుద్ది విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో దండు కొమురయ్య తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో సొమ్మసిల్లి పడిపోయాడని స్థానికులు ఆయనను గుర్తించి కుటుంబ సభ్యులకు, 100 నంబర్‌కు సమాచారం అందించి 108 వాహనం ద్వారా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల సంస్కృతి ఏమాత్రం మంచిది కాదని ఇలాంటి చర్యలను ప్రోత్సహించే పార్టీలకు, వ్యక్తులకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో శంకరపట్నం మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


