కేశవపట్నం వారసంత వేలం రూ.4.14,000/- ముగింపు
-బాలయ్యకు దక్కిన హక్కులు
-వారసంత రోడ్డుపై నిర్వహణపై స్థానికుల ఆందోళన
-కేటాయించిన స్థలంలోనే జరపాలని డిమాండ్..
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన వారసంత వేలం ఉత్సాహంగా జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ వారసంతకు సంబంధించిన హక్కులను చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బాలయ్య రూ.4,14,000కు దక్కించుకున్నారు. వేలం ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించగా, గ్రామస్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అయితే, వారసంత నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా గ్రామపంచాయతీ కేటాయించిన మార్కెట్ యార్డులోనే వారసంత నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపై పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కాసగోని ప్రభాకర్, గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, గ్రామ కార్యదర్శి నరసయ్య, కారోబార్ సదానందం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


