కేసీఆర్‌ది అంతా నటనే..
బలహీనమైన బీఆర్ఎస్‌ను కాపాడుకునే తాపత్రయం
కొడుకు, అల్లుడు వల్ల పార్టీ మరింత దిగజారుతోంది
నీళ్ల విషయంలో ఆయన అనేక తప్పిదాలు చేశారు
బీజేపీ ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు
యూరియా కొరతకు కేంద్రమే కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు
తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది : మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమైందని, పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ఆయన మళ్లీ బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కొడుకు, అల్లుడు కారణంగానే బీఆర్ఎస్ మరింత దిగజారుతోందన్న విషయం కేసీఆర్‌కే అర్థమైందన్నారు. పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనడం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ ముందు చెప్పే మాటలకు, వెనక చేసే పనులకు పొంతన ఉండదని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదని, తాగునీటి కోసమేనని సుప్రీంకోర్టులో కేసీఆర్ ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని, తెలంగాణ నీటి హక్కులను పూర్తిగా వినియోగించుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు.
బీజేపీ ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్‌కు తోడుగా నిలిచిందని జూపల్లి ఆరోపించారు. జగన్ దగ్గరకు వెళ్లి రాయలసీమను ‘రత్నాల సీమ’గా చేస్తానని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కానీ తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు సాధించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రేమ చూపించడం అంతా రాజకీయ నటనేనని ఎద్దేవా చేశారు. యూరియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ… యూరియా కొరతకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. సరఫరా తగ్గితే డిమాండ్ పెరగడం సహజమని, ఉన్న యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. రైతులు లైన్లలో నిలబడడం చూడలేకే ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఎందుకు పూర్తిస్థాయిలో తెరిపించలేకపోయారని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఇప్పటికే మీ తోలు ప్రజలే తీశారు
ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు ప్రజలకు మాత్రమే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్‌కు తగిన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ప్రతిపక్షం ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నించారు. మీరు హాస్టల్ అద్దెలు పెండింగ్ పెడితే కాంగ్రెస్ చెల్లించిందని, గోదాముల్లో స్కూళ్లు నడిపితే ఇప్పుడు సొంత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. మా మీద ఆరోపణలు ఉంటే సభలో చర్చించాలన్నారు. కేసీఆర్‌పై ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఉద్యోగాల హామీలపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, ప్రజల తరఫున గట్టిగా పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.


