- ‘సిర్పూరు’కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్
- ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు
- మళ్లీ తెరమీదికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మంగళవారం చింతలమాన్ పెళ్లి మండలం డబ్బా గ్రామంలో 83 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిర్పూర్ నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటికీ, మంగళవారం ఆయన అసెంబ్లీలో పలు సార్లు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును మళ్లీ తెరమీదికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు.
అంతేకాక, జాతీయ రహదారి నిర్మాణం, హ్యామ్ ఫేస్ 1 పంచాయతీ రోడ్ల బిటి రెన్యువల్ లో కూడా ఆయన చొరవ తీసుకున్నట్టు హరీష్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పూర్ కు కేవలం 40 కిలోమీటర్ల రోడ్లు మంజూరు చేసినప్పటికీ, బెల్లంపల్లి నియోజకవర్గానికి 100 కిలోమీటర్లు మంజూరు చేసినందుకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో రూ.6వేల కోట్ల కేంద్ర నిధులు ఆగిపోయాయని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వర్షాలు పడే ముందే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఏడీఏ మనోహర్, వ్యవసాయ శాఖ అధికారి కార్టీష్, హౌసింగ్ ఏఈ సాహిల్, పంచాయతీ కార్యదర్శులు, భాజపా జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, మాజీ జడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మండల అధ్యక్షుడు డోకే రాము, కుంచాల విజయ్, మాజీ ఎంపిటిసి దుర్గం మోతిరాం, తదితరులు పాల్గొన్నారు.


