కేసీఆర్‌కు పాపం తగిలింది
ఆయన కుటుంబంలో పైసల పంచాయితీ రాజుకుంది
కాళేశ్వరం కూలింది.. వాళ్లింట్లో కాసులు కురిసినయ్
ప్రజల సొమ్ము తిన్నోళెవరూ బాగుపడలే..
రెండేళ్లుగా ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నా
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం
ఎర్ర బస్ రావడమే కష్టం అనుకున్న చోటుకు ఎయిర్ బస్ తీసుకొస్తా
ఏడాది తిరిగే లోపే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తా ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
రూ.18.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగం
జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: గత రెండేళ్లుగా ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్ బస్‌ను దించి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.

కాళేశ్వరం కూలేశ్వరమైంది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో పైసల పంచాయితీ తప్ప.. మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తిన్నవారు ఎవరూ బాగుపడే చరిత్ర లేదని హెచ్చరించారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని.. వారింట్లో కాసులు కురిశాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టు పేరు మారిందని, ప్లేస్ మారింది, అంచనాలు లక్ష కోట్లకు పెరిగాయని మండిపడ్డారు. ఒక పెద్దాయన ఆదిలాబాద్‌కు దెయ్యంలా పట్టారని సెటైర్లు గుప్పించారు.

ప్రజల దీవెన, దేవుడి సంకల్పం
ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సంక్షేమం – అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. చిన్న వయసులోనే నాకు గొప్ప అవకాశం దక్కడం ప్రజల దీవెన, దేవుడి సంకల్పమని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదని, ఎమ్మెల్యేలను కూడా సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని గత పదేళ్లలో చూశామని ఆరోపించారు.
గత ప్రభుత్వంపై నేను పోరాటం ప్రారంభించాను
ఏ ఆశయంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో గత పదేళ్లలో అది నెరవేరలేదని వివర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటరీ రూపొందించామని, పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈనెల 8, 9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం పనులు ప్రారంభం అవుతాయని, ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే గత ప్రభుత్వంపై తాను పోరాటం ప్రారంభించానని తెలిపారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం పర్యాటకంగా అభివృద్ధి చేసే దస్త్రంపై సంతకం పెట్టానని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే మరోసారి వచ్చి పనులను సమీక్షిస్తానని అన్నారు.



