కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ లో కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగ్రుతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.
అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలులో ఐదున్నర నెలల ఉండి వచ్చిన గతేడాది నవంబర్ 23నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు రూ. 2500 ఆర్ధిక సాయం అందించాలని పోస్టు కార్డు ఉద్యమం చేసినట్లు చెప్పారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినప్పుడు గళమెత్తినట్లు కవిత తెలిపారు. బనకచర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత చెప్పుకొచ్చారు. సీఎం సొంతజిల్లాలో భూనిర్వాసితులకు అండగా ఉన్నామన్నారు. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలుపుకుని..గులాబీ కండువాలతో అనేక ప్రజాసమస్యలపై మాట్లాడమని కవిత తెలిపారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పెద్దలు పునారాలోచన చేయాలన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు చెలువలు పలవలుగా ప్రచారం చేశారన్నారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు దానిలో తప్పేం ఉందని ప్రశ్నించారు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నాను. ఆయన స్పూర్తితోనే సామాజిక తెలంగాణ కాదా..నేనేమైనా తప్పు మాట్లాడానా సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ కు అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అవుతుందా?
నేను రామన్న ను గడ్డం పట్టుకుని, బుజ్జగించి అడుగుతున్నాను..ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని..నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా అంటూ ప్రశ్నించాను. నేను కూర్చోని ప్రెస్ మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా నాకైతే అవమానమే అన్నారు కవిత.


