కాకతీయ, తెలంగాణ బ్యూరో : గీత కార్మికులు తాటి, ఈతచెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలు జరగకుండా కాటమయ్య రక్షక కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి 80 మంది లబ్ధిదారులకు కాటమయ్య రక్షక కిట్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైనా కులవృత్తులను ప్రోత్సహించే దిశగా ప్రజా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. గీత కార్మికుల భద్రత కోసం సాంకేతికంగా, శాస్త్రీయంగా ఈ రక్షక కిట్లు రూపొందించారని చెప్పారు. మహిళలకు భరోసా కల్పించేందుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలవుతున్నాయని వివరించారు.
రైతులకు మద్దతుగా రూ.21 వేల కోట్లతో పంట రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధుల జమ, క్వింటా సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేశామని చెప్పారు. పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. పేదల గృహ అవసరాల కోసం మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, కూసుమంచి తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు


