శివరామ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
కాకతీయ, ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మ రావుపేట గ్రామంలోని శివరామ క్షేత్రంలోని శివాలయంలో శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి శుభ తిధిని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఎస్పి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో వేకువజామునే సుప్రభాతంతో శివుని మేలుకొలిపి శివలింగానికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వేకువ జామునుండే భక్తులు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు శివలింగానికి పాలు, జలాభిషేకాలు చేస్తూ శివభక్తిని చాటుకున్నారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ నడిపెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.


