కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమీషనరేట్ రూరల్ సబ్‌డివిజన్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.స్టేషన్ ఆవరణ, సిబ్బంది పరేడ్‌ను పరిశీలించిన కమిషనర్ సిబ్బందికి అందించిన కిట్ల వినియోగం సక్రమంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, హాజరు, విధుల పంపిణీ విధానాలను సమీక్షించి, సీసీటీఎన్‌ఎస్ లో నమోదైన కేసులను పూర్తి వివరాలతో నమోదు చేయాలని ఆదేశించారు.పోలీస్ శాఖ వినియోగిస్తున్న సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్‌కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ నేరాల విచారణకు ఉపయోగించే అప్లికేషన్లు, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరా వంటి సాంకేతిక పరికరాలపై పూర్తి పట్టు సాధించి, వాటిని రోజువారీ పనుల్లో వినియోగించాలని కమిషనర్ సూచించారు.ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ తెలిపారు.కొత్తపల్లి స్టేషన్ పరిధిలోని వార్డులు, గ్రామాలను సెక్టార్లు,సబ్‌సెక్టార్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాల్సిందిగా సూచించారు. విధుల్లోకి కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లు రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు వంటి అన్ని రకాల పనుల్లో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని చెప్పారు.రౌడీ షీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా పెంచి, వారి కదలికలను పర్యవేక్షిస్తూ, ప్రతి నెలా తాజా సమాచారం అప్‌డేట్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.స్టేషన్ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్‌తో పాటు సిబ్బందిని కమిషనర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాంబమూర్తి, చీనా నాయక్, సంజీవ్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



