ప్రతిభకు వేదికగా కరీంనగర్ వ్యాస,వక్తృత్వ పోటీల ఫలితాలు విడుదల
రాష్ట్ర ఫైనల్ రేసులో నలుగురు విద్యార్థులు
కాకతీయ, కరీంనగర్ : సమానత్వం, కృతజ్ఞత వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలనే లక్ష్యంతో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభా పోటీలు జిల్లా కేంద్రంలో విజయవంతంగా జరిగాయి. ట్రస్మా, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు.వ్యాసరచన విభాగంలో కరీంనగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థి బి. సాయి శ్రేష్ఠ ప్రథమ స్థానం, వెలిచర్ సరస్వతి పాఠశాల విద్యార్థిని నెట్టు సంజనా ద్వితీయ స్థానం సాధించారు.వక్తృత్వంలో పారామిత హెరిటేజ్ స్కూల్‌కు చెందిన ఎ. సినీతిక ప్రథమ స్థానం, జడ్‌పీహెచ్ఎస్ ఆసిఫ్‌నగర్ విద్యార్థి డి. లక్ష్మీ శ్లోక ద్వితీయ స్థానం గెలుచుకున్నారు.జిల్లా స్థాయిలో మొదటి రెండు స్థానాలు పొందిన ఈ నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌లోని జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర విజేతలకు చిన్నజీయర్ స్వామి స్వయంగా బహుమతులు అందజేయనున్నారు.ఫలితాలను ప్రజ్ఞ వికాస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, కోట జూనియర్ కళాశాలల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. వికాస్ తరంగిణి అధ్యక్షుడు గౌతమ్ రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రస్థాయిలోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటాలని వారు ఆకాంక్షించారు.


