కాకతీయ, నేషనల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ లోని ఓ కాలేజీ విద్యార్థినిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ముఖానికి గాయలయ్యాయి. దీంతో విద్యార్థిని ముఖానికి 17 కుట్లు వేశారు. అలెన్ హౌస్ రుమా కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న 21సంవత్సరాల వైష్ణవి సాహు అనే విద్యార్థిని ఈనెల 20న కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది.
అయితే మార్గం మధ్యలో శ్యామ్ నగర్ ప్రాంతంలో కొన్ని వీధికుక్కలు, కోతులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన వైష్ణవిపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో వైష్ణవి ముఖ్యం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు విద్యార్థిని ప్రయత్నించినా ఫలితం లేదు. ఆమెను రోడ్డుపై పడేసి తీవ్రంగా గాయపరిచాయి. విద్యార్థిని కేకలు విన్న స్థానికులు కర్రలతో పరుగెత్తుకు వచ్చి కుక్కలను తరిమికొట్టారు.
అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అల్లాడుతున్న వైష్ణవిని హుటాహుటిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. వైష్ణవి ముఖంపై ఏకంగా 17 కుట్లు వేశారు. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలన్నింటిని పట్టుకుని వెంటనే షెల్టర్లకు తరలించాలని విజ్నప్తి చేసింది. తన బిడ్డలా మరెవరికీ ఇలా జరగకూడదన్నారు.


