కామారెడ్డి కకా వికలం
జిల్లాలోని అర్గొండ స్టేషన్‌లో 42 సెం.మీ వర్షపాతం
నీటమునిగిన పదుల సంఖ్యలో గ్రామాలు
నీటిలో తేలియాడుతున్న కామారెడ్డి పట్టణం
జిల్లాలో అనేక చోట్ల తెగిపోయిన రోడ్డు
రైలు సేవలకు అంతరాయం.. విద్యుత్ సరఫరాకు బంద్
సహాయం కోసం జనాల ఎదురు చూపులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో/ నెట్వర్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం మయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, శామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టితో పట్టణం జలమయమైంది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్‌లో 42 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 ప్రదేశాలలో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కామారెడ్డి బికనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్‌లోని వడ్యాల్‌లో 27.58, కామారెడ్డి లోని తాడ్వాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్ధానాలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేట్‌లో 24.1 , మెదక్ లోని నాగపూర్‌లో 23.65, నిర్మల్‌లోని విశ్వనాథ్ పేట్‌లో 23.38, ముజిగి లో 22 , లింగంపేట్ లో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. మరో 18 ప్రాంతాల్లో అత్యధికంగా భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
జలదిగ్బంధంలో కామారెడ్డి..!
కామారెడ్డి పట్టణం కేంద్రంతో పాటు.. జిల్లాలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి, సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లు రద్దు చేశారు. జిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి.. సదాశివనగర్, గాంధారిలో రోడ్లు కోతకు గురయ్యాయి. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ, అశోక్‌నగర్, పంచముఖి హనుమాన్ కాలనీ, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు నీటమునిగాయి. లోతట్టుప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలింపు చేశారు. సత్య గార్డెన్, ఉర్దూ భవన్‌లో పునరావాసం ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల పాటు కామారెడ్డి జిల్లాకు వర్ష సూచన ఉండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావస కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు రెస్క్యూ టీం ద్వారా సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
బండి సంజయ్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదలపై బండి సంజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని బండి సంజయ్ తెలిపారు. వరద బాధితులను కాపాడేందుకు ఎయిర్‌ఫోర్స్, హెలికాప్టర్ పంపాలని కోరడంతో రాజ్‌నాథ్ సింగ్ హెలికాప్టర్ పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాకు మంత్రులు..
కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా.. వరద ప్రాంతాలను ఇవాళ(గురువారం) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించనున్నారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీయనున్నారు. భారీ వర్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం.


