కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కొత్త పార్టీ ఆవిర్భావం గురించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే వందలాది మంది మేధావులు, నేతలతో చర్చలు జరిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం తాను కూడా అదే తరహాలో ఆలోచనలు, చర్చలు కొనసాగిస్తున్నానని తెలిపారు.
తండ్రి పార్టీ అయిన బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యింది తానేనని కవిత వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ శాఖలో సమస్యల గురించి 2016లోనే కేటీఆర్‌కు జాగ్రత్త సూచనలు చేశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కేసీఆర్ సొంతమని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందు చెప్పారని గుర్తు చేశారు. హరీష్ రావుతో తనకు ఏవైనా విభేదాలు కాళేశ్వరం అంశం వరకే పరిమితమని, ఇతర విషయాల్లో ఎలాంటి సమస్య లేదని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం తనకు లేదని కవిత స్పష్టంచేశారు. కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించలేదని, అలాగే తాను కూడా ఆ పార్టీలో ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తరచూ తన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. “ఎప్పటికప్పుడు నా పేరే ఎందుకు తీసుకుంటున్నారు? లేకపోతే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారా?” అని కవిత ప్రశ్నించారు.
ప్రజలందరి కోసం పని చేయాలనే సంకల్పంతో ఉన్నానని కవిత అన్నారు. బీసీ ఇష్యూ తన మనసుకు బాగా దగ్గరగా అనిపించిందని, ఆ దిశగా తాను మరింతగా ఆలోచిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను ఒక ఫ్రీ బర్డ్ గా ఉన్నానని, తన ద్వారాలు అందరికీ తెరిచి ఉన్నాయని చెప్పారు. పలువురు తనను సంప్రదిస్తున్నారని, తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుల జాబితా చాలా పెద్దదని వెల్లడించారు.
కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు వేడెక్కుతున్నాయి. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక ఇప్పటికే ఉన్న ఏదైనా వేదికలో కొనసాగుతారా? అన్నది ఆసక్తికర చర్చగా మారింది.


